కరోనా పీడితులకు కల్పతరువు..అతితక్కువ ధరకే వెంటిలేటర్‌

ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేందుకు ఎవరి వంతు సాయం వారు చేస్తున్నారు. కొందరు సాంకేతికంగా.. మరికొందరు ఆర్థికంగా.. ఇంకొందరు సేవల రూపం లో తోడ్పాటునందిస్తున్నారు. కొవిడ్‌-19 బాధితులసంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వారికి వైద్యసేవలందించేందుకు అవసరమైనన్ని వెంటిలేటర్లు అందుబాటు లో లేకపోవడం అందరికీ ఆవేదన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిశ్చయించుకొన్న హైదరాబాద్‌ శాస్త్రవేత్త ఆష్షాఫర్హాన్‌ వెంటనే తన ఆలోచనకు పదనుపెట్టారు. ముంబైలోని ‘ఎక్సీడ్‌ స్పేస్‌' సంస్థలో చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఫర్హాన్‌ ప్రైవేట్‌ ఉపగ్రహాల తయారీలో తనకున్న పరిజ్ఞానంతో వెంటిలేటర్ల రూపకల్పనకు నడుం బిగించారు. ఇండ్లలో వాడే వాక్యూమ్‌ క్లీనర్‌ను ఇందుకు ఆయుధంగా ఎంచుకొన్నారు. దీనితోపాటు పీవీసీ పైపులను, స్ప్రింక్లర్లను ఉపయోగించి ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేసే వెంటిలేటర్‌ను డిజైన్‌ చేశారు.




యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాతోపాటు ‘సెంటర్‌ ఫర్‌ సేఫ్టీ సిమ్యులేషన్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ’ సా యంతో రూపొందించిన ఈ డిజైన్‌కు ‘గ్లోబల్‌ ఓపెన్‌సోర్స్‌ వెంటిలేటర్‌' అనే పేరు పె ట్టారు. అద్భుతమైన ఈ ఆవిష్కరణలో ఫ్లోరిడాకు చెందిన శాస్త్రవేత్త సిమ్‌ లంపాటాంగ్‌ నేతృత్వంలోని యువ శాస్త్రవేత్తల బృందం కీలకపాత్ర పోషించింది. ఈ బృందంలో ఫర్హాన్‌తోపాటు అమెరికా, కెనడా, ఐర్లాండ్‌, వియత్నాం, బ్రెజిల్‌కు చెందినవారున్నారు. సాధారణంగా ఒక వెంటిలేటర్‌ కొనుగోలుకు రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని, కానీ తమ డిజైన్‌కు అయ్యే ఖర్చు రూ.5 వేలలోపే ఉంటుందని, దీని సాయం తో రోగులకు ప్రాణవాయువు (ఆక్సిజన్‌) అందించవచ్చని ఫర్హాన్‌ వివరించారు. తమ డిజైన్‌కు త్వరలో శాస్త్రీయ ఆమోదం తీసుకొని వెంటిలేటర్ల ఉత్పత్తి మొదలుపెడతామన్నారు. తమ డిజైన్‌ను ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతామని, ఈ డిజైన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రపంచంలో ఎవరైనా సులభంగా వెంటిలేటర్లను తయారుచేసుకోవచ్చని, అందుకే దీనికి ‘గ్లోబల్‌ ఓపెన్‌సోర్స్‌ వెంటిలేటర్‌'గా నామకరణం చేశామని ఫర్హాన్‌ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ డిజైన్‌ వివరాలను అమెరికాకు చెందిన ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ అమెచ్యూర్‌ రేడియో’ వెబ్‌సైట్‌లో కూడా ఉంచారు.